కావున ఆయన సేవకులు ఆయనతో, “నీ ఆలనాపాలనా చూడటానికి వయస్సులో ఉన్న ఒక అమ్మాయిని మేము చూస్త్తాము. ఆమె నీ పక్కలో పండుకొని నీకు తగిన వెచ్చదనం సమకూర్చుతుంది.” అని అన్నారు.
అలా చెప్పి రాజు సేవకులు ఇశ్రాయేలు రాజ్యమంతా ఒక చిన్నదాని కొరకు వెదక నారంభించారు. రాజుకు వెచ్చదనాన్ని ఇవ్వగలిగే రూపం, యవ్వనం ఉన్న స్త్రీ కొరకు వారు వెదకసాగారు. చివరకు అబీషగు అనబడే షూనేమీయురాలిని చూచి, ఆమెను రాజు వద్దకు తీసుకొని వచ్చారు.
(5-6) దావీదు కుమారుడు అదోనీయా “నేనే రాజునౌతానని” అనుకొన్నాడు. (అదోనీయా తల్లి పేరు హగ్గీతు) అదోనీయా చాలా అందమైనవాడు. అతడు రాజు కావాలని మిక్కిలి ఉబలాటపడ్డాడు. అందువల్ల తనకు తానే ఒక రథాన్ని, గుర్రాలను సమకూర్చుకున్నాడు. తన ముందు పరుగెత్తుటకు ఏభై మంది మనుష్యులను కూడా నియమించాడు. అతడు అబ్షాలోము తర్వాత పుట్టాడు. దావీదు రాజు ఎప్పుడూ అదోనీయాను మందలించలేదు, విమర్శించలేదు. “ఏమి చేస్తున్నావు?” అని కాని, “అది ఎందుకు చేశావు?” అని కాని అతడు ఎప్పుడూ అడగలేదు.
కాని అదోనీయా రాజు కావడానికి ఒప్పుకోని వారిలో యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్తయైన నాతాను, షిమీ, మరియు దావీదు రాజుయొక్క ప్రత్యేక అంగరక్షకుడైన రేయీ వుండిరి. అందువల్ల వీరు అదోనీయాతో కలియలేదు.
అదోనీయా కొన్ని జంతు బలులను అర్పించాడు. అతడు కొన్ని గొర్రెలను, ఆవులను, మరియు కొన్ని బలిసిన కోడెదూడలను సమాధాన బలిగా ఇచ్చాడు. అదోనీయా ఈ బలులన్నీ ఏన్‌రోగేలు దగ్గరవున్న జోహెలేతు అను శిలవద్ద సమర్పించాడు. ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమానికి అదోనీయా చాలామందిని ఆహ్వానించాడు. రాజైన దావీదుయొక్క ఇతర కుమారులను, యూదా పాలకులు, నాయకులందరినీ అదోనీయా ఆహ్వానించాడు.
ఇదంతా విన్న నాతాను, సొలొమోను తల్లియైన బత్షెబ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “హగ్గీతు కుమారుడైన అదోనీయా ఏమి చేస్తున్నాడో నీవు విన్నావా? తనకై తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. మన యజమానియైన దావీదు కూడ ఈ విషయం ఎరుగడు.
దావీదు రాజు వద్దకు వెళ్లి, ‘నా ప్రభువైన రాజా, నీ తరువాత రాజ్యానికి వారసుడు నా కుమారుడైన సొలొమోను అవుతాడని నీవు ప్రమాణం చేశావు. కాని ఇప్పుడు అదోనీయా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
బత్షెబ ఇలా చెప్పసాగింది, “మహారాజా! ప్రభువైన నీ దేవుని పేరు మీద నీవు నాకు ఒక ప్రమాణం చేశావు. ‘నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడు. నా సింహసనం మీద సొలొమోను రాజ్య పాలన చేస్తాడు’ అని అన్నావు.
సమాధానబలి ఇచ్చే నిమిత్తం అదోనీయా చాలా జంతువులను చంపాడు. అతడు ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. మరియు నీ కుమారులనందరినీ ఆహ్వానించాడు. యాజకుడైన అబ్యాతారును, సైన్యాధ్యక్షుడు యోవాబును కూడ అతడు ఆహ్వానించాడు. కాని అతడు నిన్ను సేవించే నా కుమారుడైన సొలొమోనును మాత్రం ఆహ్వానించ లేదు.
నాతాను రాజుతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, నీ తరువాత రాజ్య పాలనకు కొత్త రాజుగా అదోనీయాను ప్రకటించావా? నీ తరువాత ప్రజాపాలన చేయటానికి అదోనీయాను నియమించాలని నిర్ణయించావా?
ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులంనదరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు.
అప్పుడు రాజు ఒక ప్రమాణం చేశాడు, “నా ప్రభువైన దేవుడు నాకు సంభవించిన ప్రతి ఆపదనుండి నన్ను కాపాడాడు. నా ప్రభువైన దేవుడు నిత్యుడు. ఆ దైవశక్తితో నేను ప్రమాణం చేస్తున్నాను:
గతంలో నీకు నేనిచ్చిన మాటను ఈ రోజు నెర వేర్చుతాను. ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా యొక్క శక్తితో నేనీ ప్రమాణం చేసియున్నాను. నా తరువాత నీ కుమారుడైన సొలొమోను రాజవుతాడని నీకు ప్రమాణం చేశాను. నా తరువాత నా సింహాసనం మీద నా స్థానాన్ని అతడు పొందుతాడని కూడా మాట ఇచ్చాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను.”
“మీరు రాజాధికారులను మీతో తీసుకొని, నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదపై ఎక్కించి దిగువనున్న గిహోను చలమ [*గిహోను చలమ ఇది యెరూషలేము నగరానికి ప్రధానమైన నీటి వసతి. ఈ చలుమ సరిగ్గా నగరానికి బయట లోయలో ఉంది. ఇది అదోనీయా, అతని మనుష్యులు ఉన్న ఏన్‌రొగేలుకు చాలా దగ్గరలో ఉంది.] దగ్గరకు తీసుకొని వెళ్లండి.
తరువాత అతనితో కలిసి ఇక్కడకి తిరిగిరండి. అతడు నా సింహాసనం మీద కూర్చుండి, నా స్థానంలో రాజుగా వ్యవహరిస్తాడు. ఇశ్రాయేలు మీద, యూదా మీద రాజుగా వుండటానికి నేనతనిని ఎన్నుకున్నాను,” అని రాజైన దావీదు వారితో అన్నాడు.
యెహోవా ఎల్లప్పుడు మా యజమాని రాజువైన నీకు సహాయ పడుతూ వచ్చాడు. యెహోవా ఇప్పుడు సొలొమోనుకు సహాయపడును గాక! దేవుడు సొలొమోనును కూడా నీకంటె ఘనమైన రాజుగా చేయునుగాక!” అని అన్నాడు.
యాజకుడైన సాదోకు పవిత్ర గుడారము నుండి తనతో నూనె పట్టుకెళ్లాడు. సాదోకు ఆ నూనెను సొలొమోను తలపైపోసి రాజుగా అభిషిక్తుని చేశాడు. వారప్పుడు బాకా వూదగా అక్కడున్న ప్రజలంతా, “సొలొమోను రాజు వర్ధిల్లుగాక!” అని అన్నారు.
ఆ సమయంలో అదోనీయా, మరియు అతనితో ఉన్న అతిథులు భోజనాలు పూర్తి చేస్తున్నారు, వారు బూరనాదం విన్నారు. “నగరంలో ఏమి జరుగుతూ వుంది, మనం వినే శబ్దం ఏమిటి?” అని యోవాబు అడిగాడు.
యోవాబు అలా మాట్లాడుతూ వుండగానే యాజకుడైన అబ్యాతారు కుమారుడు యోనాతాను అక్కడికి వచ్చాడు. అదోనీయా అతనిని చూసి “రా, లోనికి రా! నీవు చాలా మంచివాడవు [†మంచివాడు “ముఖ్యమైన వ్యక్తిని” అని పాఠాంతరం. ఈ హిబ్రీ మాటకు, “ముఖ్యమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి” అని అర్థం.] నీవు ఏదైనా మంచివార్తే నాకు తెస్తూ వుండవచ్చు” అని అన్నాడు.
రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తయగు నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, మరియు తన సేవకులను అతనితో పంపాడు. వారు సొలొమోనును రాజు యొక్క స్వంత కంచర గాడిదపై కూర్చుండబెట్టారు.
తరువాత యాజకుడైన సాదోకు, ప్రవక్తయైన నాతాను ఇరువురూ సొలొమోనుకు గిహోను వద్ద పట్టాభిషేకం చేశారు. వారుప్పుడు నగరానికి తిరిగి వెళ్లారు. ప్రజలు వారిననుసరించి వెళ్లారు. కావున ఇప్పుడు నగరంలో జనంమంతా చాలా సంతోషంగా వున్నారు. ఆ శబ్ధమే మీరిప్పుడు వింటున్నారు.
రాజు యొక్క సేవకులంతా రాజైన దావీదు వద్దకు అతను మంచిపని చేసినట్లు చెప్పటానికి వచ్చారు. వారంతా, ‘దావీదు రాజా, నీవు చాలా గొప్ప రాజువి! కాని నీ దేవుడు సొలొమోనును కూడ ఒక గొప్పరాజుగా చేయాలని ప్రార్థిస్తున్నాము. నీ దేవుడు సొలొమోనును నీకంటె ఖ్యాతిగల రాజుగా చేయును గాక. నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు చేయునుగాక!’ అని అంటున్నారు. యోనాతాను నగరంలో జరుగుతున్న విషయాలు అదోనీయాతో ఇంకా ఇలా చెప్పసాగాడు: తరువాత రాజైన దావీదు దేవుని ప్రార్థించటానికి తన పక్కమీదే సాష్టాంగ పడ్డాడు.
‘ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవాకు జయమగును గాక! యెహోవా నా కుమారులలో ఒకనిని నా సింహాసనం మీద కూర్చుండ జేశాడు. దేవుడు అది నేను చూడగలిగేలా చేశాడు’ అని దావీదు రాజు అన్నాడు.”
అదోనీయా కూడ సొలొమోనుకు భయపడ్డాడు. కావున అతడు బలిపీఠం వద్దకు వెళ్లి, ఆ పీఠపు కొమ్ములను [‡పీఠపు కొమ్ములు అంటే అతను క్షమాభిక్ష కోరుతున్నాడని అర్థం. ఏ వ్యక్తి అయినా తాను తప్పు చేయకపోతే, అతడు పవిత్రస్థలంలోనికి వెళ్లి బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటే అప్పుడా వ్యక్తి శిక్షింపబడకూడదు.] పట్టుకున్నాడు.
ఈ లోపు ఒకడు సొలొమోను వద్దకు వెళ్లి, “అదోనీయా నీవంటే చాలా భయపడిపోతున్నాడు. అతడు బలిపీఠం వద్ద ఉన్నాడు. అతడు బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, అక్కడినుండి పోవటం లేదు. సొలొమోను వద్దకు ఎవరైనా వెళ్లి తనను చంపకుండా వుండేలా ప్రమాణం చేయించమని వేడుకుంటున్నాడు” అని చెప్పాడు.
అది విన్న సొలొమోను, “అదోనీయా గనుక బుద్ధిమంతునిలా మెలిగితే, అతని తలమీది ఒక్క వెంట్రుక కూడ రాలదని నేను ప్రమాణం చేస్తున్నాను. కాని అతడేమైనా పొరపాటు చేస్తే, వాడు చావటం ఖాయం” అని అన్నాడు.
అప్పుడు సొలొమోను కొంతమందిని పంపి అదోనీయాను తీసుకొని రమ్మన్నాడు. వారు అదోనీయాను రాజైన సొలొమోను వద్దకు తీసుకొచ్చారు. అదోనీయా రాజైన సొలొమోను ముందుకు వచ్చి సాష్టాంగపడ్డాడు. “నీవు ఇంటికి వెళ్లు” అని సొలొమోను అతనితో అన్నాడు.